లెబనాన్‌ను మరోసారి పేలుళ్లు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మంగళవారం పేజర్లు పేలి వేలాది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు లెబనాన్‌ను వణికించాయి. తాజాగా వాకీటాకీలు, మొబైల్స్ పేలిపోయాయి. దీంతో వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. లేటెస్ట్ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతిచెందిన వారికి బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాజధాని బీరూట్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి.
లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హిజ్బుల్లా ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే లెబనాన్.. అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులోనే ఇజ్రాయెల్ పేలుడు పదార్ధాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది. తాజా ఘటనలు లెబనాన్ భద్రతా వైఫల్యానికి మాయని మచ్చగా చెప్పొచ్చు.
మంగళవారం పేజర్ల పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా.. 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితో పాటు హిజ్బుల్లా కీలక నేతలున్నారు. ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.
The video captures the moment a communication device exploded at a funeral for the victims of pager explosions in southern #Lebanon. pic.twitter.com/uyaOqZMuAc
— Tehran Times (@TehranTimes79) September 18, 2024