12 new moons found around Jupiter: గురు గ్రహం సౌరవ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా.. పురాణాల్లో, జోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను కనుక్కున్నారు. ఇంతవరకు ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహంగా శని గ్రహం ఉంటే.. ప్రస్తుతం ఆ స్థానాన్ని గురుగ్రహం దక్కించుకుంది. చంద్రుల రారాజుగా గురుగ్రహం మారింది. ఏకంగా 92 ఉపగ్రహాలు గురుని చుట్టూ తిరుగుతున్నాయి. శని గ్రహం చుట్టూ 83 చంద్ర ఉపగ్రహాలు తిరుగుతున్నాయి.
Read Also: Jagga Reddy: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్‌లోని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్ నుండి ఖగోళ శాస్త్రవేత్త స్కాట్ షెపర్డ్ నిర్వహించిన పరిశీలనలలో కొత్తగా 12 చంద్రులు వెలుగులోకి వచ్చాయి. ఇది ఓ మిని సౌరవ్యవస్థగా మారింది. ప్రస్తుతం కనుక్కున్న ఈ ఉపగ్రహాలు గురుగ్రహ వ్యవస్థలో చాలా దూరంగా ఉన్నాయి. వెలుగులోకి వచ్చిన ఈ ఉపగ్రహాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. మొత్తం 12 ఉపగ్రహాల్లో 9 ఉపగ్రహాల కక్ష్యలు 550 రోజుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
గురుగ్రహ వ్యవస్థను అణ్వేషించడానికి నాసా ఓ మిషన్ పంపేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో కొత్తగా ఈ 12 చంద్రులను కనుక్కున్నారు. యూరోపా క్లిప్పర్ మిషన్ లో భాగంగా గురుగ్రహం ఉపగ్రహం అయిన యూరోపాపై సముద్రాలను అధ్యయనం చేయనున్నారు. భూమితో పోలిస్తే యూరోపాపై నీరు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌరవ్యవస్థలో ఫెయిల్డ్ స్టార్ గా గురు గ్రహాన్ని అభివర్ణిస్తారు. నక్షత్రం కలిగే అర్హతలు ఉన్నప్పటికీ నక్షత్రంగా మారలేక.. పెద్ద వాయుగోళంగా ఉంది. భూమి సురక్షితంగా ఉండటానికి ఓ రకంగా గురుగ్రహమే కారణం. అంతరిక్షం నుంచి వచ్చే తోకచుక్కలు, గ్రహశకలాలను తన గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించి భూమిని రక్షిస్తోంది.