రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. TRS పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందని ఎద్దేవ చేశారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రజా సంగ్రామ యాత్రలో తాము రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను తెరవలేదని చెప్పారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి తరలించాలని ఆయన అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి, వరదలకు కొట్టుకుని పోయిందని అన్నారు. దీంతో రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు రైతులకు అనుకూలంగా ఉండాలని ఆయన హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారని అన్నారు. ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారు.. అది ఎన్నటికీ జరబోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం పైన తీవ్ర వ్యతిరేకత.. ఆ.. కుటుంబాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నరని మండిపడ్డారు. ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లో గెలవలేక పోయారని ఎద్దేవ చేశారు. హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేశారని, ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. రేపటి సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. స్పష్టమైన సందేశం అమిత్ షా ఇవ్వబోతున్నారని, కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Etela Rajender: అమిత్ షా సభ సక్సెస్ చేస్తాం