Loan App Harassment: ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. తాజాగా, శ్రీశైలం శిఖరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.. ఆమెను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెన్నెలగా గుర్తించారు.. ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి నిన్న రాత్రి శిఖరం వద్ద ఉన్న కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు స్థానిక పోలీసులు సమాచారం అందజేశారు.. ఇక, విషయం తెలుసుకున్న శ్రీశైలం సీఐ ప్రసాదరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకొని లోయలోకి దూకిన యువతి కోసం గాలింపు చేపట్టారు.. అయితే, ఎంతకు కనపడకపోవడంతో తిరిగి ఈరోజు తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు.. చివరకు యువతి ఆచూకీ తెలిసింది.. చిన్న చిన్న గాయాల పాలైన యువతిని శ్రీశైల దేవస్థానం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి.. తల్లిదండ్రులకు సమాచారం అందించామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
శ్రీశైలం సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి వెన్నెల స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి కొలకలూరు గ్రామం.. ఇటీవల ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా యువతి తల్లికి బాగోలేదనే కారణంతో 15 వేలు లోన్ తీసుకోగా.. దానికి 5 రెట్లు డబ్బులు చెల్లించిన మరలా చెల్లించాలని లేకపోతే ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో పెడతామని వేధింపులకు గురచేశారట.. దీంతో, మనస్థాపానికి గురైన యువతి.. ఆ వేధింపులను తట్టుకోలేక శ్రీశైలం వచ్చి కొండపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలిపారు.. అయితే యువతిని ప్రాణాపాయం నుండి కాపాడి శ్రీశైలం సీఐ ప్రసాదరావు యువతి కుటుంబ సభ్యులకు అలానే తెనాలిలో మిస్సింగ్ కేసు నమోదైన కారణంగా అక్కడి పోలీసులకు కూడా విషయం తెలియజేశారు.. లోన్ యాప్స్.. సైబర్ నేరాల నుంచి జాగ్రత్త వహించాలని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.