మరోసారి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..
ఆర్. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది.. కాగా, ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు మరోసారి అవకాశం దక్కింది.. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టిన కృష్ణయ్య.. దాదాపు రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.. అయితే, ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడంతో.. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలతో పాటు.. కూటమి నేతలు చర్చలు జరిపారు.. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇక, నేను పూర్తిస్థాయిలో బీసీ సమస్యలపై ఉద్యమం చేస్తానని ప్రకటించారు కృష్ణయ్య.. కానీ, బీజేపీ జాతీయ నేతలు.. ఏపీ కూటమి నేతలు కూడా చర్చలు జరిపారు.. దీంతో.. ఆయన మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ఆర్.కృష్ణయ్యకు కూటమి పూర్తి మద్దతు ప్రకటించింది.. ఇక, దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి..ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం విదితమే..
మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం.. జగన్‌పై మంత్రి ఫైర్..
రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని, 42 మంది ప్రజలు కొట్టుకుపోయి చనిపోతే కనీసం వారికి న్యాయం కూడా చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజల యొక్క సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారమయ్యేవి అధికారులు పరిష్కారం చేస్తారని, పరిష్కారం కాని సమస్యలను 45 రోజుల లోపు పరిష్కారం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే హైకోర్టు బెంచ్ , పరిశ్రమలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారని మంత్రి అన్నారు.
హైకోర్టులో ఆర్జీవీకి మరోసారి ఊరట.. తొందరపాటు చర్యలొద్దు..!
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు.. కాగా, తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన ఆర్జీవీకి మొదట ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.. అంతేకాదు.. తనకు థర్డ్ డిగ్రీ భయాలు కూడా ఉన్నాయని తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.. ఇక, తనపై కావాలనే కేసులు పెడుతున్నారని కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొంది.. మరోవైపు వర్మపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా, కోర్టులో విచారణ జరిపి.. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. అంతేకాదు.. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది.
సిట్‌తో రేషన్ మాఫియా ఆగడాల ఆటకట్టు..!
సిట్ తో పేదల బియ్యం మాఫియా ఆగడాల ఆటకట్టు అన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు.. సక్రమమైన ఎగుమతులు – దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుచెప్పారు.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని విమర్శించారు.. పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను ఆపడం వెనక ఉన్న స్ఫూర్తి ముఖ్యం అన్నారు.
సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలి.. కేంద్రానికి లేఖ రాస్తానన్న బొత్స
వైజాగ్‌లో డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో కాకరేపింది.. అయితే, విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై నేను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను అన్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు మేనేజ్‌కు గురైతే మన పరువు పోతుందన్నారు.. అందుకోసం సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానని వెల్లడించారు.. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి.. చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారన్నర ఆయన.. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషమే అన్నారు.. కానీ, సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు..
కలెక్టర్ల కాన్ఫరెన్స్ తాజా తేదీలు ఇవే.. దిశానిర్దేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చసి ఆరు నెలలు పూర్తవుతోంది. అయితే, ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం అవుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు.. తమ టార్గెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న కూటమి ప్రభుత్వం.. మరిన్ని భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.. మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వివిధ శాఖల వారీగా కాన్ఫరెన్స్‌లో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.. ఇక, రెండో రోజు ముగింపు సమయంలోనూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆరు నెలల పాలన పూర్తవుతున్న వేళ.. కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నారట.. ఈ సారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట.. వీటి అమలుపైనా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ 6 నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించి కీలక సూచనలు చేయనున్నారు. వ్యవసాయం, నీటి పారుదల అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారట.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా.. భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన.. ఫిర్యాదుల పరిష్కారంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు..
గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్‌లో 8.30 నుంచి 9.30 గంటల వరకు..మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత వచ్చిన వారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరని అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు చేసింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ కీలక నేతలు సోనియా బర్త్‌డే వేడుకలను కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగ్గారెడ్డి నానా హంగామా చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం పోతురాజులతో కలిసి జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. పోతురాజుల కొరడా పట్టుకుని జగ్గారెడ్డి కాసేపు చిందులు వేశారు. జగ్గారెడ్డి డ్యాన్స్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. సోనియా బర్త్‌డే వేడుకల్లో పాల్గొని మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల మాటలను విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయ్యిందని. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించారు. రైతు రుణమాఫీ హామీ కూడా దాదాపుగా పూర్తయ్యిందన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ కూడా అమలవుతోందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాందీ మాట ఇస్తే తప్పే వ్యక్తులు కారన్నారు. ఒక రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకున్నారన్నారు.
ఆప్ రెండో జాబితా విడుదల.. సిసోడియా స్థానం త్యాగం!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలు.. ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా సోమవారం (డిసెంబర్ 09) రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. 20 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాను ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్థానం బదిలీ అయింది. ప్రస్తుతం ఉన్న పటపఢ్ గంజ్ స్థానం కాకుండా జంగ్‌పురా నియోజకవర్గానికి మార్చబడింది. ఎన్నో ఏళ్ల నుంచి సిసోడియా పటపఢ్ గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆ స్థానాన్ని ఇటీవల ఆప్‌లో చేరిన యూపీఎస్సీ ప్రముఖ కోచ్ అవధ్ ఓజాకు విడిచిపెట్టారు. పటపఢ్ గంజ్ స్థానం నుంచి ఓజా పోటీ చేయనున్నారు.
ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం! ఇండియా కూటమి మద్దతు!
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సభలో ప్రతిపక్షంపై చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తీర్మానానికి ఇండియా కూటమి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఉభయ సభలు ప్రారంభం అయిన దగ్గర నుంచి అదానీ లంచం వ్యవహారం సభలను కుదిపేస్తున్నాయి. దీంతో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశం సభల్లో రగడ సృష్టిస్తోంది. అయితే సభలో ఛైర్మన్ ధన్‌కర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్షం పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇండియా కూటమి ఎంపీలంతా ఈ విషయంలో ఒక్కటవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉభయ సభల్లో గందరగోళం నేపథ్యంలో సభా నాయకుడు జేపీ నడ్డాను, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను తన ఛాంబర్‌కు రావాలంటూ ఛైర్మన్ ఆహ్వానించారు. సభలో చోటుచేసుకున్న పరిణామాలపై ధన్‌కర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సభ సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఛైర్మన్ చర్చించనున్నట్లు సమాచారం.
జెవార్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. త్వరలో పూర్తి సేవలు
నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో తొలి విమాన టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. సోమవారం అధికారులు నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్‌గా ముగిసింది. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం నోయిడాలో దిగింది. విమానం ల్యాండ్ కాగానే.. ఫైర్ ట్యాంకర్లతో నీటిని వెదజల్లి స్వాగతం పలికాయి. విమానం ల్యాండింగ్‌పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయం అని కొనియాడారు. 2025, ఏప్రిల్ నుంచి ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉన్న నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. సోమవారం అధికారులు తొలి విమాన పరీక్ష నిర్వహించారు. నోయిడా విమానాశ్రయంలోని రన్‌వేపై ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజల కోసం కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ప్రధాన విమానాశ్రయంగా గుర్తింపు పొందుతుంది.
ఆసీస్ విజయానికి వాళ్లిద్దరే కారణం.. మా టార్గెట్ అదే..!
అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. తొలిరోజు స్వింగ్ అవుతున్న పింక్ బాల్ ముందు మార్నస్ లబుషేన్, నాథన్ మెక్‌స్వీనీల అద్భుతంగా ఆడటంతోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చాలా సేపు క్రీజులో ఉండి పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. లబుషేన్, మెక్‌స్వీనీ తొలి రోజు చివరి సెషన్‌లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు సాధించారుని అన్నాడు. టిమ్ ఫైన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మొదటి రోజు చివరి సెషన్‌లో మేము టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాం’ అని పేర్కొన్నాడు. ‘ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో పింక్ బాల్‌తో పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్న నిజమైన ఛాంపియన్‌ను మేము చూడగలిగాము.’ అని తెలిపాడు. ‘తన కెరీర్‌ను కాపాడుకోవడానికి.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ బ్యాట్స్‌మెన్‌ని చూశామని.’ ఫైన్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ: ఆడాలా.. వద్దా.. పాకిస్థానే నిర్ణయం తీసుకోవాలి : మాజీ క్రికెటర్
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై ఉత్కంఠ కొనసాగుతుంది. పాక్ లో పర్యటించే ప్రసక్తి లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఈ అంశంపై మాజీ క్రికెటర్ మదన్‌లాల్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బంతి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోర్టులోనే ఉంది.. పీసీబీనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై బీసీసీఐ ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా చెప్పిందని మదన్ లాల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలా.. వద్దా.. అనేది పాకిస్థానే నిర్ణయించుకోవాలన్నారు. క్రికెట్ కొనసాగాలంటే.. వారు ఆడాలని నేను అనుకుంటున్నాను.. దాని వల్ల పాకిస్థాన్ ప్రయోజనాలు పొందుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై పీసీబీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ పేర్కొన్నారు.
మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?
సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. ఆస్తుల పంపకాల వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక మా మధ్య ఏమీ లేదని, ఈ వార్తలు అవాస్తమని మీడియాకి లీకులు ఇస్తున్నా సరే జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతోంది. మరికాసేపట్లో జల్ పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్ళిన మంచు విష్ణు అక్కడి నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు రానుండటంతో జల్ పల్లి నివాసం వద్ద బౌన్సర్లను మోహరించారు. జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్లను మోహరించారు విష్ణు, మనోజ్. విదేశాల్లో ఉన్న విష్ణు తన వ్యాపార భాగస్వామి ద్వారా సీసీ ఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకుని 40 మంది బౌన్సర్లను కాపలా పెట్టారు. మనోజ్ కూడా 30 మందిని తెప్పించుకున్నారు. మరో పక్క మనోజ్ భార్య సొంత ప్రాంతమైన ఆళ్లగడ్డ నుండి మంచు మనోజ్ కు మద్దతుగా మరికొందరు వచ్చినట్టు చెబుతున్నారు. మంచు విష్ణు వస్తుండడంతో జలపల్లి మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనగా మోహన్ బాబు నివాసం వద్ద లేడీ బౌన్సర్లు కూడా రంగంలోకి దిగారు. మంచు ఫ్యామిలీలో వివాదానికి కేంద్ర బిందువుగా వినయ్ అనే వ్యక్తి మారారు. ఎంబియూ, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న వినయ్ కారణంగానే ఈ వివాదం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. ఇక మరోపక్క మోహన్ బాబు నివాసానికి వచ్చి కాసేపటి తరువాత మంచు లక్ష్మి వెళ్లిపోయారు. అయితే మంచు విష్ణు ఇక్కడ లేరని అమెరికాలోనే ఉన్నారని ఆయన పీఆర్ టీం వెల్లడించింది.
అమితాబ్ బచ్చన్@ అల్లు అర్జున్ ఫ్యాన్.. మాస్ ఎలివేషన్ మావా ఇది!
పుష్ప సెకండ్ పార్ట్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో ఆయన నటనకు గాను ఇటు విమర్శకుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఆయన మీద ఒక రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద అమితా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సెకండ్ పార్ట్ సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన సమయంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే బాలీవుడ్ యాక్టర్ ఎవరు అని అడిగితే అది అమితాబ్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయనకు చాలా లాంగ్ కెరియర్ ఉందని ఇండియా మొత్తానికి మెగాస్టార్ అయిన ఆయన సినిమాలు చూస్తూనే మేము పెరిగేమని చెప్పుకొచ్చారు. పెరుగుతున్న సమయంలో ఆయన ఇంపాక్ట్ మా మీద చాలా ఉందని ఆయన అన్నారు.