Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.
19 ఏళ్ల యువతి ధనుశ్రీకి ముస్లిం వ్యక్తితో సంబంధం ఉంది. ఈ విషయం సోదరుడు నితిన్‌కి తెలిసింది. దీనిపై మంగళవారం రాత్రి 9.30 సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముస్లిం వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించవద్దని నితిన్ తన సోదరికి సూచించినప్పటికీ ఆమె నిరాకరించడంతో కోపంతో ఆమెను చెరువులోకి తోసేసి చంపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నితిన్ బంధువుల్లో ఒకరి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. పోలీసులుకు విషయం తెలియడంతో ప్రస్తుతం నితిన్‌ని అరెస్ట్ చేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
పోలీసుల ప్రకారం.. ధను శ్రీ ముస్లిం వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. గత కొంత కాలం ఆమె అన్న పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూనే ఉన్నాడని, ప్రతీసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని, అయితే తల్లిదండ్రులు కలుగజేసుకుని శాంతింపచేసేవారని, తల్లిదండ్రులు కూడా సంబంధం కొనసాగించవద్దని కోరినా బాధితురాలు వినిపించుకోలేదని తెలుస్తోంది.
మంగళవారం రాత్రి నితిన్ తల్లిని, సోదరిని బైక్‌పై గ్రామంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో చెరువు వద్ద ఆపేసి, ధనుశ్రీని అందులోకి తోశాడు. ఆమెను రక్షించేందుకు తల్లి అనిత ఎంత ప్రయత్నించినా కూడా వినకుండా ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు. ఆ తర్వాత తల్లిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మునిగిపోయింది.