అడుగడుగునా మోసగాళ్ళు.. ఆదమరిస్తే అంతే సంగతులు. డ్రగ్స్ అంటూ నకిలీ మందులను జనానికి అంటగట్టే ముఠాలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ ముఠా గుట్టురట్టయింది. మెడికల్ టాబ్లెట్స్ లోని పౌడర్ ను నార్కోటిక్ డ్రగ్స్ అంటూ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిందో ముఠా. మోసానికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారుకూకట్ పల్లి పోలీసులు.
ట్రమాటాస్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నుండి పౌడర్ వేరు చేసి డ్రగ్స్ అని నమ్మించి పబ్బులలో విక్రయిస్తోందీ ముఠా. తమకు అందిన సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. ముఠా సభ్యులు ఐడిఎల్ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ముఠా సభ్యులు సూరజ్ థాపా, బిమ్లా దేవి, బిశాల్ గురుంగ్, బిషోకరమ రాజ్ కుమార్, పూరన్ బహుదూర్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ విక్రయించిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వెంకటాద్రి పై కేసు నమోదు చేశారు.