ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నారు. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సైబర్ నేరాలంటే.. పిన్ నెంబర్ తెలుసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేయడం, ఓటీపీ ద్వారా సొమ్మును దొంగిలించడం, పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్స్ వంటివి ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేరగాళ్లు సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుని కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది “డిజిటల్ అరెస్ట్”. ఈ పద్ధతిన నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత చదువులు చదినిన వారిని కూడా బురిడీ కొట్టిస్తున్నారు. మరి.. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ? దీని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
READ MORE: Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
ఇటీవల హైదరాబాద్ అడిక్‌మెట్‌కు చెందిన వృద్ధురాలి(85)కి గత నెల 26న ముంబయి పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నటి శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన మనీలాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయిందని బెదిరించాడు. నిన్ను ‘డిజిటల్ అరెస్టు’ చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా, ఎఫ్‌డీలు, పీపీఎఫ్ ఖాతాల్లోని రూ.5.9 కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడు. ఇలాంటి వందలాది ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు అనగానే భయపడి వారికి లొంగిపోతున్నారు.
అసలు ఎలా జరుగుతుంది..
గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ వేషధారణలో స్కైప్ లేదా వాట్సప్‌లో వీడియోకాల్ చేస్తాడు. తనను తాను సీబీఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమయిందని, మీపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సప్‌కు పంపిస్తాడు. అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, అందులో నగదు జమైనట్టు ఆధారాలు ఉండటంతో ఆయన కంగుతింటాడు. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర నేరం కావడంతో అరెస్టు తథ్యమని, బెయిలు కూడా దొరకదని, నెలల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుందని అవతలి వ్యక్తి భయపెట్టడంతో బాధితుడు వణికిపోతాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు ఫోన్‌కాల్‌ను బదిలీ చేస్తున్నానని చెబుతాడు. వెనువెంటనే మరో వ్యక్తి వీడియో కాల్‌లోకి వస్తాడు. తనను తాను సైబర్ క్రైమ్ ఎస్పీ లేదా ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటాడు. ‘మీరు డిజిటల్ అరెస్టు’ అయ్యారని, విచారణకు సహకరించాలని, నేరంలో మీ ప్రమేయం లేదని తేలితే కేసు నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతాడు. విచారణ పూర్తయ్యేవరకు వీడియో కాల్ ఆఫ్ చేయొద్దని, మరెవరితోనూ మాట్లాడొద్దని, మలమూత్ర విసర్జనకు వెళ్లినా తలుపు తెరిచే ఉంచాలని షరతులు విధిస్తాడు.
READ MORE: Nandikotkur Crime: మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు..
చివరకు మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే.. డబ్బులను ఇవ్వాలని అంటారు. లేదంటే.. జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. ఇదంతా వింటున్న బాధితులకు ఏం చేయాలో అర్థంకాదు. ముందు ఆ సమస్య నుంచి బయటపడాలనే ఆరాటంలో.. వాళ్లు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా.. మనిషిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఒక స్క్రీన్ ముందు నిర్బంధించి దోచుకోవడాన్నే ‘డిజిటల్ అరెస్ట్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. కాగా.. దీనిపై తాజాగా పోలీసులు స్పందిస్తూ.. ఈ తరహా నేరాలు పెరిగాయన్నారు. తెలంగాణాలో ఈ డిజిటల్ అరెస్టులు పెరగడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.