Nalgonda Nurses: ఆడవారికి బిడ్డను కనడం మరోసారి పుట్టడం లాంటిది అంటారు పెద్దలు.. పురిటి నొప్పులు ఎంత భయంకరంగా ఉంటాయో అనుభవించిన వారికే తెలుస్తోంది.. మాటల్లో ఎంత చెప్పుకున్న తక్కువే అవుతోంది. ఆ బాధ ఒక్క ఆడవారికి మాత్రమే తెలుస్తోంది. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే ఆడవారు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఒక మహిళ పురిటి నొప్పులతో అల్లలాడుతూ ఉంటే సాధారణమైన మహిళలకే కంట నీరు వస్తూ ఉంటుంది.. అయితే వీరు నర్సులు.. ఒక బాధ్యతాయుతమైన పని చేస్తున్నారు. హాస్పిటల్ కు వచ్చినవారికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. వారితో నీచంగా ప్రవర్తించి ఆడజాతికే మాయని మచ్చగా మారారు. ఒక నిండు ప్రాణం తీసిన హంతకులుగా మారారు. ఈ దారుణ ఘటన నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం కు చెందిన శిరసు అఖిల (21) కు గతేడాది వివాహమయ్యింది. ఆమె మొదటి కాన్పుకోసం సెప్టెంబర్ 12 న నల్లగొండ ప్రభత్వాసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. మొదటి కాన్పు కావడం అందులోనూ చిన్న వయస్సే కావడంతో పురిటి నొప్పులొ తట్టుకోలేకపోయింది అఖిల.. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అక్కడి నర్సులతో ఎలాగైనా అఖిలను కాపాడాలని వేడుకున్నారు. అయితే సదురు నర్సులు మాత్రం కొంచెం కూడా మానవత్వం లేకుండా అఖిలను వార్డులోపలికి తోసి హింసించారు. ఎందుకు అట్లా అరుస్తున్నావ్.. పడుకున్నప్పుడు తెలియదా.. ఇలా నొప్పులు వస్తాయని అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఆమెకు కాన్పు చేయడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అఖిల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె అత్త పూలమ్మ.. త్వరగా కాన్పు చేయమని బతిమిలాడగా..ఇదేమైనా ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నావా.. నొప్పులు రాగానే కాన్పు చేయడానికి.. మాకు తెలుసు నువ్వు కూర్చో అని ఆమె కళ్లముందే అఖిల కడుపు పై కాలితో తొక్కుతూ, తోస్తూ టైమ్ పాస్ చేశారు. ఇక ఆ ఒత్తిడికి తట్టుకోలేని అఖిల మగబిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోయింది. అంత జరిగిన నర్సులు జంకకుండా సెల్ ఫోన్ లో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక వెంటనే అఖిల భర్త పై అధికారులకు ఫోన్ చేయడంతో అఖిలను ఐసీయూ లో జాయిన్ చేశారు. కాలితో తన్నడం, తోయడం చేయడంతో అఖిల పొత్తికడుపు వద్ద రక్తం బాగా పోయిందని, రక్తస్రావం తగ్గడం లేదని చెప్పడంతో వెంటనే అఖిలను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తన భార్య చావుకు కారణమైన వారిని శిక్షించాలని భర్త, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.