Robbery: ముఖానికి ముసుగు ధరించి, బ్యాగులో నుంచి తుపాకీ తీసి తాళాలు అడిగి, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించి దొంగతనాలకు పాల్పడడం సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. అలా సినీఫక్కీలోనే ఓ భారీ చోరీ జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ చోరీ కలకలం రేపుతోంది. చోరీ జరిగి 24 గంటలు గడిచినా నేరగాళ్ల ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. పక్కా పథకం ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన 23కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఉదయ్‌పూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయాన్ని సోమవారం ఉదయం ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.
ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలోకి ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో సెక్యూరిటీ లేని గేటు నుంచి ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలకి చొరబడ్డారు. దుండగులు వచ్చినప్పుడు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు, ఓ ఖాతాదారుడు ఉన్నారు. ఒక్కో దుండగుడు ఒక్కో ప్రదేశానికి వెళ్లి వారి బ్యాగుల్లో తుపాకీలు తీసి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరించారు. మేనేజర్ క్యాబిన్‌తో పాటు, బంగారం, నగదు భద్రపరిచే గదిలోకి దొంగలు ప్రవేశించారు. కార్యాలయంలోని ప్రధాన గదిలో ఉన్న వారందరినీ ఒక మూలకు వెళ్లాలని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. వెళ్లకపోతే ఉద్యోగులు, వినియోగదారులను కాల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని ల్యాండ్‌లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. వీరందరికి ఓ దుండగుడు కాపాల ఉండగా.. మిగిలిన వారంతా స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లి అక్కడ భద్రపర్చిన తాకట్టుకు వచ్చిన బంగారు నగలను బ్యాగుల్లో సర్దుకున్నారు. సుమారు 23 కిలోల బంగారాన్ని ఆ దుండగులు ఎత్తికెళ్లారు. మణప్పురం సిబ్బంది దుండగులతో వాగ్వాదం పెట్టుకోగా.. పలుమార్లు సిబ్బందిని దుండగులు కొట్టినట్లు పోలీసులకు కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు దొంగలు బ్యాంకు అధికారులను తుపాకీతో కొట్టడం బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో బంధించిన ఘటనకు సంబంధించిన వీడియోలో ఉందని పోలీసులు తెలిపారు.
Sara Ali Khan and Shubman Gill: యంగ్ క్రికెటర్‌తో సారా అలీఖాన్ డేటింగ్..! ఇదిగో సాక్ష్యం
కార్యాలయం నుంచి దుండగులు బయటకు వెళ్లేటప్పుడు మణప్పురం కార్యాలయ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చేతులు కట్టేసి, మిగిలినవారు బయటకు రాకుండా ఆఫీసు ప్రధాన ద్వారానికి తాళం వేసి పరారయ్యారు. దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో ఈచోరీ మొత్తం పూర్తయింది. అనంతరం బ్యాంకు అధికారులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకునేందుకు నగర సరిహద్దుల్లో బారికేడింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎట్టకేలకు ఆ నిందితులను పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు. ఈ చోరీలో సంస్థ సిబ్బంది ప్రమేయంపై కూడా విచారణ చేపడతామని వెల్లడించారు. ఆ కార్యాలయానికి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.