Uttar Pradesh: సోదరి కులాంతర వివాహం చేసుకుందని పగ పెంచుకున్న వ్యక్తి, ఆమె భర్తను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బిజ్నోర్‌లోని చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరాపూర్ ఖాదర్ గ్రామంలో నిన్న రాత్రి హత్య జరిగింది. బాధితుడిని చాంద్‌పూర్‌లో నివాసం ఉంటున్న బ్రజేష్ సింగ్‌గా గుర్తించారు.
Read Also: Pakistan: వాట్సాప్‌లో “దైవదూషణ”.. పాకిస్తాన్ విద్యార్థికి మరణశిక్ష..
బ్రజేష్ సింగ్ అదే గ్రామానికి చెందిన దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహాన్ని దివ్య కుటుంబం అంగీకరించలేదు. దీంతో ఇద్దరు పారిపోయారు. బ్రజేష్‌తో దివ్య సోదరుడు లవ్‌సిత్ స్నేహంగా ఉండేవాడు. అయితే, తన సోదరిని వివాహం చేసుకోవడంతో అతనిపై పగ పెంచుకున్నాడు. దివ్య కుటుంబం జనవరి 5, 2023న చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై కేసు కూడా నమోదు చేసింది.
పెళ్లి తర్వాత చాలా నెలలుగా గ్రామానికి దూరంగా ఉన్న ఈ జంట, ఇటీవల తిరిగి గ్రామానికి వచ్చింది. శుక్రవారం రాత్రి బ్రజేష్ ఒంటరిగా కనిపించడంతో లవ్‌సిత్, అతని సహచరులు అతడిని కాల్చి చంపారు. బ్రజేష్ షెడ్యూల్డ్ కులానికి చెందిన వాడు కాగా, దివ్య ఓ సైనీ అని, ఇరువురు ఏడాది క్రితం వివాహం చేసుకున్నారని, దీంతో ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తత పెరిగిందని ఎస్పీ నీరజ్ కుమార్ జాదౌన్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లవ్‌సిత్‌ని అరెస్ట్ చేయగా, అతని సహచరుల కోసం గాలిస్తున్నారు.