Home Theatre Blast: ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో హోం థియేటర్ పేలుడుతో సోమవారం పెళ్లి కొడుకు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. హోం థియేటర్ పేలడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ పేలుడులో కొత్తగా పెళ్లైన వ్యక్తితో పాటు ఆయన అన్నయ్య చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హోం థియేటర్ లో బాంబును అమర్చి పెళ్లిలో గిఫ్టుగా ఇచ్చినట్లు తేలింది.
Read Also: Home Theatre Explodes: హోం థియేటర్ పేలుడు.. పెళ్లి కొడుకుతో పాటు మరొకరి మృతి..
పేలుడు ధాటికి ఇంటి గోడలతో పాటు పై కప్పు కూలిపోయింది. 22 ఏళ్ల వరుడు హేమేంద్ర మెరావి చనిపోయాడు. హోం థియేటర్ కనెక్షన్ ఇచ్చి స్విచ్ ఆన్ చేయగానే పేలిపోయింది. హోం థియేటర్ లో బాంబును అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గిఫ్టు ఎవరిచ్చారనే విషయంపై విచారణ జరగగా అసులు విషయం వెలుగులోకి వచ్చింది.
పెళ్లి కూతురు మాజీ లవర్ ఈ గిఫ్టు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని సర్జుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కబీర్ ధామ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ మాట్లాడుతూ.. తన ప్రియురాలు పెళ్లి చేసుకున్నందుకు కోపం పెంచుకున్న సర్జు, పేలుడు పదార్థాలు ఉన్న హోం థియేటర్ ను గిఫ్టుగా ఇచ్చినట్లు నేరాన్ని అంగీకరించాడు. చనిపోయిన వ్యక్తి హేమేంద్ర మెరావికి ఏప్రిల్ 1న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రోజు గిఫ్టులను ఓపెన్ చేస్తున్న సమయంలో సర్జు గిఫ్టుగా ఇచ్చిన హోం థియేటర్ పేలింది. ఈ ఘటనలో మెరావితో పాటు అతని అన్నయ్య రాజ్ కుమార్(30) చనిపోయారు. ఏడాదిన్నర బాలుడితో సహా మరో నలుగురు గాయపడ్దారు. వారిని కవ్రాధాలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.