Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రాకేష్ అనే దళిత యువకుడిని ఫయాజ్, ఆసిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టడంతో అతను మరణించాడు. నిందితుల సోదరి నడుపుతున్న ఓ హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్ అనే వ్యక్తి ఫయాజ్ సోదరిలో వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Jagdeep Dhankhar: రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
యాద్గీర్ ఎస్పీ సంగీత కథనం ప్రకారం.. 22 ఏళ్ల రాకేష్ చపాతీ కొనడానికి ఫయాజ్ సోదరి నడుపుతున్న షాపుకు వెళ్లాడు. అయితే, అతను రాగానే చపాతీలన్నీ అయిపోయాయని చెప్పింది. అయితే తనకు ఎలాగైనా చపాతీలు కావాలని రాకేష్ గొడవ పెట్టుకున్నాడు. వాగ్వాదం ఎక్కువ కావడంతో సదరు మహిళ తన సోదరుడికి ఫోన్ చేసింది. గొడవ భౌతిక దాడికి దారి తీసింది. దీంతో రాకేష్ మరణించాడు.
ముందుగా ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనడాడింది. అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఒప్పించారు. యాద్గీర్ పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 109 , 504 (శాంతి భంగం కలిగించడం) మరియు 302 (హత్యకు శిక్ష)తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.