ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అవకాశాన్ని ఆసరాగా చేసుకొని వేధింపులకు గురిచేస్తూ తమ వాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మేడ్చల్ కు చెందిన ఓ యువతి తన తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి చెందడంతో పాటు అంతకు ముందే తల్లి కూడా కన్నుమూయడంతో.. తండ్రి పింఛన్ ను తనకు ఇప్పించాలని మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో అదనపు ట్రెజరీ అధికారి పవన్ కుమార్ ను సంప్రదించింది.
దీనితో సదరు అధికారి తనతో సినిమాకు వస్తే పింఛన్ ఇప్పిస్తానని యువతిని వేధింపులకు గురి చేసాడు. విసుగు చెందిన యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం నాడు జిల్లా అధికారులు మేడ్చల్ ఏటీవో కార్యాలయంలో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని సదరు అధికారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి నర్సింహ తెలిపారు.