Tragedy: కొందరని మరణంకూడా విడదీయలేదు.. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉండి.. ప్రమాదంలో ఒకేసారి ప్రమాణాలు విడిచినవారు కొందరైతే.. స్నేహితులు.. లేదా కట్టుకున్నవారు.. పిల్లలు.. ఇలా సన్నిహితులు ప్రాణాలు విడిచిన కొన్ని క్షణాల్లోనే.. ప్రాణాలు వదిలినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..
మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంచిరెడ్డిపల్లెలో ఉస్తెలమూరి దిబ్బారెడ్డి (85), తిరుపాలమ్మ(75) దంపతులు నివాసం ఉండేవారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తిరుపాలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు పడలేదు. పరిస్థితి విషమించి ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుటుంబ సభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, శ్మశాన వాటిక నుంచి తిరిగొచ్చిన గంటలు వ్యవధిలోనే ఆమె భర్త దిబ్బారెడ్డి ఒక్క సారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. చెంచిరెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలమూకున్నాయి.. వెంట వెంటనే తల్లిదండ్రులు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది..