ప్రపంచం రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజితో దూసుకుపోతున్నా కొంతమందిలో మాత్రం మూర్ఖత్వం మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా ప్రేమ పెళ్లిలపై తల్లిదండ్రుల తీరు మాత్రం మారడంలేదు. కూతురు వేరే కులం వాయ్కటిని పెళ్లి చేసుకొందని, పరువు తీసిందని కన్నా కూతురినే చంపేస్తున్నారు లేదంటే ఆమెను కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి, కూతురు ఒక దళితుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. బేతుల్ జిల్లాలోని చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్.. హాస్టల్ లో ఉంటూ నర్సింగ్ చదువుతుంది. కాలేజీలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్ అనే దళిత యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరు కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని, పట్నంలో కాపురం పెట్టారు. ఇక ఈ ఏడాది జనవరిలో యువతి ఇంట్లో తమ పెళ్లి విషయం చెప్పడంతో తండ్రి కోపంతో రగిలిపోయాడు.
తన కూతురు తనకు లేదని, మిస్ అయ్యిందని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇక ఇలా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను కూర్చోపెట్టి మాట్లాడగా యువతీ తండ్రి పెళ్ళికి ఒప్పుకుంటున్నట్లు నాటకమాడాడు. ఇటీవల కూతుర్ని ఇంటికి తీసుకెళ్తానని హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేధింపులకు గురి చేశాడు. అంతేకాకూండా దళితుడిని పెళ్లి చేసుకుందని ఆమెకు గుండు కొట్టించి, పుణ్య స్నానం చేయించాడు. తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షి ఇంట్లో నుంచి పారిపోయి భర్తను చేరుకొంది. ఆ తర్వాత వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.