Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ తన తల్లిదండ్రుల్ని హత్య చేశారు. కెరీర్, చదువు విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు రావడంతోనే హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్కర్ష్ ధాఖోలే డిసెంబర్ 26న కపిల్ నగర్‌లో వారి నివాసంలో తల్లిదండ్రుల్ని హత్య చేయగా, దుర్వాసన వస్తుందని పోరుగువారు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఈ హత్యలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల కుళ్లిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, ఉత్కర్ష్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతులను లీలాధర్ ధాఖోలే (55), అతని 50 ఏళ్ల భార్య అరుణగా గుర్తించారు.
Read Also: 2025 Public Holidays List: ఈ ఏడాది బ్యాంకు, స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే!
డిసెంబర్ 26 మధ్యాహ్నం ఉత్కర్ష్ తన తల్లి టీచర్ అయిన అరుణ గొంతు కోసి హత్య చేశాడు. పవర్ ప్లాంట్‌లో టెక్నీషియన్ అయిన తండ్రి లీలాధర్‌ని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్కర్ష్ కత్తితో పొడిచి హత్య చేశారు. రెండు మృతదేహాలను అక్కడే వదిలేశాడని అధికారులు తెలిపారు. ఉత్కర్ష్ తన ఇంజనీరింగ్ కోర్సులో అనేక సబ్జెక్టులు క్లియర్ చేయడంలో విఫలమయ్యారు. అందువల్ల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ మానేసి వేరేదాన్ని ఎంచుకోవాలని కోరారు. అయితే, అందుకు ఉత్కర్ష్ ఒప్పుకోలేదని విచారణలో తేలింది.
తల్లిదండ్రుల హత్య తర్వాత, హత్య విషయం తెలియన తన సోదరిని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులు ఓ మెడిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు బెంగళూర్ వెళ్లినట్లు బందువులకు మాయమాటలు చెప్పాడు. తన సోదరితో కలిసి ఉత్కర్ష్ మేనమామ ఇంటిలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలు వెలుగులోకి రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.