Bangalore Girl Cheated By Cyber Boyfriend Neel Yash: ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యేవారిని నమ్మొద్దని అధికారులు ఎంత సూచిస్తోన్నా.. కొందరు చెవికి ఎక్కించుకోవడం లేదు. గుడ్డిగా నమ్మి, వారి చేతిలో నిలువునా మోసపోతున్నారు. తాజాగా ఓ యువతి కూడా అలాగే మోసపోయింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి వలలో పడి, అక్షరాల రూ. 2.20 లక్షలు పోగొట్టుకుంది. అతడు ప్రేమ, పెళ్లి అనగానే.. నిజానిజాలేంటో తెలుసుకోకుండా చేతులు కాల్చుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరు బసవనగుడికి చెందిన 29 ఏళ్ల యువతికి ఇటీవల సోషల్ మీడియాలో నీల్ యశ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను విదేశాల్లో ఉంటానని, మంచి ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత అతడు ఆ యువతిని ప్రపోజ్ చేశాడు. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు, మనిద్దరి అభిరుచులు కూడా కలిశాయి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను’’ అని నమ్మించాడు. ప్రొఫైల్ ఫోటోలో అతడు అందంగా కనిపించడం, విదేశాల్లో మంచి స్థాయిలో సెటిల్ అవ్వడం, పైగా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో.. ఆ యువతి అతని మాయమాటలకు పడిపోయింది. ఇంకేముంది.. పెళ్లి గురించి మాట్లాడటానికి బెంగుళూరుకి వస్తున్నానని చెప్పాడు.
కట్ చేస్తే.. రెండ్రోజుల తర్వాత ఓ మహిళ నుంచి బెంగళూరు యువతికి ఫోన్ వచ్చింది. ‘‘నీ ప్రియుడు నీల్ యశ్‌ను ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు, అతడ్ని విడుదల చేయాడానికి రూ. 2.20 లక్షల కస్టమ్స్ ఫీజు చెల్లించాలి’’ అని ఆ మహిళ చెప్పింది. దీంతో, యువతి మరో క్షణం ఆలోచించకుండా ఆ మహిళ చెప్పిన అకౌంట్‌కు డబ్బులు జమ చేసింది. అంతే.. ఆ తర్వాత నీల్ యశ్, ఆ మహిళ ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.