ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మనసులో పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. ప్రేమించినవారు దక్కకపోతే తమను తాము అంతం చేసుకుంటున్నారు.. లేదు అంటే ప్రేమించినవారిని అంతం చేస్తున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు తనను కాదని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. అంతేకాకుండా ఆమెను చంపి పోలీసులు వచ్చేవరకు ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. జలోర్ జిల్లాకు చెందిన శాంతి దేవి అనే యువతి, గణేష్ రామ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి శాంతి దేవి పెద్దలు అంగీకరించలేదు. కొద్దిరోజులకే ఆమెకు మరొక యువకుడితో పెళ్లి చేసేశారు. దీంతో యువతి, ప్రియుడిని మరిచి భర్తతో కాపురం చేయసాగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. అయితే ప్రియుడు మాత్రం, ప్రియురాలినే తలుచుకుంటూ, ఆమె మోసం చేసిందని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను కలవడానికి ప్రయత్నించాడు. ఆమె భర్త మహారాష్ట్రలో ఉన్నట్లు తెలుసుకున్న ప్రియుడు గణేష్ రామ్, శాంతి దేవి అడ్రెస్ తెలుసుకొని వెళ్లి కలిశాడు. తనను మర్చిపోలేకపోతున్నానని, తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిందిగా కోరాడు. అందుకు శాంతి దేవి ససేమీరా అనడంతో ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి పదునైన ఆయుధంతో శాంతి దేవిపై దాడి చేశాడు. గాయాలు గట్టిగా కావడంతో సంఘటనా స్థలంలోనే శాంతి దేవి మృతిచెందింది. ఈ షాకింగ్ ఘటనతో ఖంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసిన అనంతరం పారిపోకుండా.. ప్రియురాలి మృతదేహాన్ని హత్తుకొని ఉండిపోయాడు గణేష్.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.