బెంగళూరులో దారుణం జరిగింది. అర్ధరాత్రి దుండగుడు హాస్టల్‌లోకి ప్రవేశించి యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బీహార్‌కు చెందిన కృతి కుమారి అనే 22 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసింది. కోరమంగళ పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటుంది. మంగళవారం రాత్రి 11.10 నుంచి 11.30 గంటల మధ్య ఓ యువకుడు మూడో అంతస్తులోకి ప్రవేశించి.. కుమారిని కత్తితో పలుమార్లు పొడిచాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. రక్షించండి.. రక్షించండి అంటూ కేకలు వేసినా.. ఆమె మొర ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
సమాచారం అందుకున్న కోరమంగళ పోలీసులు, సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్నారు. పరిచయస్తుడు కాబట్టే.. అతడు హాస్టల్‌లోకి రాగలిగాడని భావిస్తున్నారు. కుమారే.. అతడిని వసతి గృహంలోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు లోపలికి వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. లోపలికి వెళ్లిన ఆమె.. కొంతసేపటి తర్వాత.. యువకుడితో కలిసి బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని.. ఆ కోపంలోనే అతడు కత్తితో పొడిచి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
రెండ్రోజుల క్రితమే యువతి.. హాస్టల్‌లో చేరిందని నిర్వాహకులు తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. హాస్టల్‌లోకి యువతి వచ్చినప్పుడు.. యువకుడు వస్తువులు తెచ్చేందుకు సాయం చేశాడని.. ఆ సమయంలో తన సోదరుడు అని పరిచయం చేసిందని గుర్తుచేశారు. సోదరుడే కదా? అని సెక్యూరిటీ సిబ్బంది నమ్మి లోపలికి పంపించారు. మరోసారి యువకుడు.. హాస్టల్‌లోకి వచ్చి ఆమె ప్రాణాలు తీశాడు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు.