కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మను మార్చబోమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఫొటోలను ముద్రించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సోమవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్లపై ఇతరుల ఫోటోలు ముద్రించాలన్న కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ క్లారిటీ ఇచ్చారు.
భారత 11వ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్‌ల చిత్రాలను కొన్ని నిర్ధిష్ట బ్యాంకు నోట్లపై ముద్రించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్టు మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. కరెన్సీ నోట్లపై మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్, కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, ఈ ఫోటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat
— ReserveBankOfIndia (@RBI) June 6, 2022