దేశంలో నిత్యావసరాల నుంచి మొదలు అన్నిటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లుగా తయారైంది ప్రజల పరిస్థితి. అయితే.. ఇప్పుడు మరో పెనుభారం సామాన్యుడి నడ్డి విరువనుంది. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో సామాన్యులకు రుణాలు భారంగా మారాయి. మళ్లీ వడ్డీ రేట్లు పెంచితే మధ్య తరగతి జీవులకు గృహ, వ్యక్తిగత తదితర రుణాలు మరింత భారం కానున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా వడ్డీరేట్ల పెంపుపై ఇప్పటికే చూచాయగా సంకేతాలిచ్చారు.
కీలక వడ్డీ రేట్లను ఇటీవల 40 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ.. ద్రవ్యోల్బణం దిగిరాలేదు. దీంతో ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికల్లో తేలింది. శక్తికాంతదాస్ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వేరే మార్గాలున్నా కూడా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారే అవకాశం ఉన్న వడ్డీ రేట్లనే పెంచేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.