Hyderabad: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత నిలకడగా ఉన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో నిలకడగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో మాత్రం హైదరాబాద్ నగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల కంటే ముందుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకే గడచిన ఏడాది కంటే 24 శాతం వృద్ధి సాధించింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో 26 శాతం విక్రయాలు పడిపోయాయి.
Read also: Andrapradesh : ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ..
ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో గతంతో పోల్చితే అమ్మకాలు 24 శాతం పెరిగినట్టు రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. తాజా వివరాల ప్రకారం నిరుడు జనవరి-జూన్‌లో హైదరాబాద్‌లో హౌజింగ్ సేల్స్ 14,460 యూనిట్లుగా ఉంటే.. ఈ జనవరి-జూన్‌లో 17,890కి పెరిగాయి. మిగతా నగరాల విషయానికొస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 26 శాతం విక్రయాలు పడిపోయాయి. నిరుడుతో చూస్తే 9,530 యూనిట్ల నుంచి 7,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. బెంగళూరులోనూ 11 శాతం దిగజారుతూ 16,020 యూనిట్ల నుంచి 14,210 యూనిట్లకు వచ్చాయి. ఇక కోల్‌కతాలో 31 శాతం క్షీణించాయి. 6,080 యూనిట్ల నుంచి 4,170 యూనిట్లకు దిగజారాయి. చెన్నైలో స్వల్పంగా 2 శాతం వృద్ధి కనిపించింది. అయితే ముంబై, పుణెల్లో సేల్స్ బాగా పెరిగాయి. ముంబైలో 62,630 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు 49,510 యూనిట్లే. అలాగే పుణెలోనూ 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్‌లో 23 శాతం వృద్ధితో 12,790 యూనిట్ల నుంచి 15,710 యూనిట్లకు పెరిగాయి. అయినప్పటికీ మొత్తంగా దేశంలోని 8 నగరాల్లో ఇండ్ల అమ్మకాలపరంగా హైదరాబాద్ నగరమే టాప్‌లో నిలిచింది. ఇక ఈ 8 నగరాల్లో నిరుడు జనవరి-జూన్‌లో జరిగిన ఇండ్ల అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 15 శాతం వృద్ధితో 1,66,090 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ తెలిపింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ప్రకటించింది.