దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించారు. 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు కావొచ్చని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉన్నాయి. ఇక దీపావళి నుంచి రెండే శ్లాబులు అమల్లోకి వస్తాయి. 12 శాతం, 28 శాతం జీఎస్‌టీ శ్లాబులను తొలగించి, కేవలం 5 శాతం, 18 శాతం జీఎస్‌టీ రేట్లను మాత్రమే ఉంచాలని యోచిస్తోంది. 5 శాతం, 18 శాతం పన్ను రేట్లు ఉంటే చాలా వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. పేద, మధ్యతరగతి జనాలకు మేలు చేకూరనుంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 12 శాతం శ్లాబులోని 99 శాతం వస్తువులను 5 శాతం శ్లాబుకు, 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులను 18 శాతం శ్లాబుకు మార్చాలని ప్రతిపాదించారు. వినియోగదారుల వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి 18 శాతం శ్లాబుకు మార్చనున్నారు. ఇదే సమయంలో పొగాకు, పాన్ మసాలా వంటి సిన్ గూడ్స్ పై మాత్రం 40 శాతం కొత్త శ్లాబును తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన జీఎస్టీ మండలిలోని మంత్రుల బృందానికి కూడా పంపనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసి సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశం నిర్ణయం తీసుకోనున్నారు.
READ MORE: Big News : కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు ఛేదించిన పోలీసులు.. హంతకుడు ఎవరంటే..?
కాగా.. ఈ శ్లాబుల మార్పులతో వ్యక్తిగత సంరక్షణ వస్తువులైన హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ లతో పాటు జామ్, జ్యూస్, చిప్స్, పాస్తా, నూడిల్స్, నెయ్యి, వెన్న, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలపై పన్నులు తగ్గనున్నాయి. మరోవైపు.. జీఎస్టీ సంస్కరణలు రోజువారీ నిత్యావసరాలను, కిరాణా సామగ్రి, మందులు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్ల వరకు మరింత సరసమైనవిగా చేస్తాయి. వ్యవసాయ పరికరాలు, సైకిళ్ళు, బీమా, విద్యా సేవలు కూడా చౌకగా మారనున్నాయి. గృహాలు, రైతులకు ప్రత్యక్ష ఉపశమనం అందించనున్నాయి. ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న వస్తువులైన కండెన్స్‌డ్ మిల్క్, డ్రైఫ్రూట్స్, ఫ్రోజెన్ వెజిటేబుల్స్, సాసేజ్‌లు, పాస్తా, జామ్‌లు, భుజియాతో సహా నామ్‌కీన్‌లు, టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిళ్లు, కార్పెట్‌లు, గొడుగులు, సైకిళ్లు, పాత్రలు, ఫర్నిచర్, పెన్సిళ్లు, జనపనార లేదా కాటన్‌తో చేసిన హ్యాండ్‌బ్యాగులు, రూ.1,000 లోపు పాదరక్షల రేట్లు 5 శాతానికి తగ్గే అవకాశం ఉంది.