ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదురోజులే పనిదినాలు ఉండాలని, తమకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈనెల 27న సమ్మె చేయనున్నట్లు 9 బ్యాంకుల యూనియన్‌ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. పెన్షనర్లందరి పెన్షన్ల అప్‌డేషన్, రివిజన్ తమ ప్రధాన డిమాండ్లుగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు ఈనెల 27న చేపట్టనున్న సమ్మెలో పాల్గొంటారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా తెలిపారు. ఒకవేళ ఈనెల 27న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగితే వరుసగా మూడురోజుల పాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 25వ తేదీ ఈనెలలో నాలుగో శనివారం కావడం, 26వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. 27వ తేదీ ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో వరుసగా మూడురోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో ఖాతాదారులు తమ అవసరాలను ముందే ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ముందు తాము ఉంచి డిమాండ్లను అంగీకరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.