దేశంలో గృహ రుణాల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేయగలిగే గృహ రుణ పరిమితిని రెట్టింపు స్థాయికి ఆర్బీఐ సడలించింది. ఈ పరిమితిని అర్బన్ సహకార బ్యాంకులకు రూ.75 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెంచింది. అలాగే గ్రామీణ సహకార బ్యాంకుల్లోనూ రూ.75 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.30 లక్షలుగానే ఉన్నది. కాగా, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను టైర్-1, టైర్-2గా వర్గీకరించారు. వీటి ఆధారంగానే అవిచ్చే రుణాలపై పరిమితులు ఉండనున్నాయి.
ఇక రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులు, జిల్లా కేంద్ర కోఆపరేటివ్ బ్యాంకులుసహా గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో వాటి నికర విలువనుబట్టి రుణ పరిమితులు ఆధారపడి ఉంటాయి. రూ.100 కోట్ల వరకు నికర విలువ కలిగిన బ్యాంకులు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు వ్యక్తిగత గృహ రుణాలను ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇది రూ.20 లక్షలుగానే ఉన్నది. ఆపై నికర విలువ కలిగిన బ్యాంకులు రూ.75 లక్షల వరకు రుణాలు ఇచ్చుకోవచ్చు. మొత్తానికి దశాబ్దకాలం తర్వాత సహకార బ్యాంకుల గృహ రుణాల పరిమితుల్ని పెంచింది ఆర్బీఐ.