పబ్లిక్ ఆఫర్ పట్ల పునరాలోచనలో పడ్డ 3 స్టార్టప్‌లు?
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల విషయంలో అంటే ఐపీఓల విషయంలో 3 స్టార్టప్‌లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫార్మ్‌ఈజీ, బోట్, ఇక్సిగో అనే ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. అన్‌లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్‌లో వీటి షేర్లకు క్రేజ్ తగ్గింది. దీంతో ఐపీఓల పట్ల ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపట్లేదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొని పేలవమైన ప్రదర్శన చేయటం ద్వారా బ్రాండ్ వ్యాల్యూని ఇంకా దిగజార్చుకోవటం ఎందుకని ఈ సంస్థలు ఆలోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్‌కి మరో గ్లోబల్ కంపెనీ. సిటీలో శాఫ్రాన్ ఎంఆర్‌ఓ ఫెసిలిటీ
విశ్వనగరంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర సిగలోకి మరో గ్లోబల్ కంపెనీ రానుంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన శాఫ్రాన్ అనే ఇంజన్ల తయారీ సంస్థ భాగ్యనగరంలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. ఎంఆర్‌ఓ ఫెసిలిటీని అంటే మెయింటనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ సదుపాయాన్ని పెద్దఎత్తున ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు 15 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక అంతర్జాతీయ సంస్థ మన దేశంలో తొలిసారిగా ఎంఆర్‌ఓ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తుండటం విశేషం. ఇప్పటికే స్టార్టప్‌ల విషయంలో తెలంగాణ.. దేశంలోనే టాప్ లెవల్‌లో నిలిచిన సంగతి తెలిసిందే.
లాభాలతో ప్రారంభమై.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఇవాళ బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై భారీ లాభాలతో ముగిశాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ పొద్దున 300 పాయింట్లు పెరిగి 53,400కి చేరిన సెన్సెక్స్ సాయంత్రం ట్రేడింగ్ పూర్తయ్యేటప్పటికి 616 పాయింట్లు లాభపడి 53,750 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 15,900 పాయింట్లకి చేరువలోకి వచ్చిన నిఫ్టీ చివరికి 178.95 పాయింట్లు పెరిగింది. 15,989.80 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఆటోమొబైల్, ఆర్థిక సేవల షేర్లకు ప్రాఫిట్స్ వచ్చాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్ బాగా లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ ఎక్కువ నష్టాన్ని మూటగట్టుకున్నాయి.