VinFast VF 6, VF 7: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో విన్ఫాస్ట్ (VinFast) మరో చారిత్రాత్మక ఘనత సాధించింది. ఇటీవల భారత మార్కెట్‌లో ప్రవేశించిన VinFast VF 6, VF 7 ఎలక్ట్రిక్ SUVలు.. Bharat NCAP నుంచి పూర్తి స్థాయి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్నాయి. ఇది భద్రత విషయంలో ఈ వాహనాలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాయని స్పష్టంగా నిరూపిస్తోంది.
Read Also: Palli Chattambi: తెలుగులోకి టోవినో థామస్ సినిమా.. అసలేంటీ పళ్లి చట్టంబి?
అయితే, Bharat NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం.. ఈ రెండు మోడళ్లు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగాల్లో అత్యుత్తమ స్కోర్లు సాధించాయి. VF 6 మోడల్ AOPలో 32లో 27.13 పాయింట్లు, COPలో 49లో 44.41 పాయింట్లు సాధించాయి. అలాగే, VF 7 మోడల్ AOPలో 28.54 పాయింట్లు, COPలో 45.25 స్కోర్ సాధించింది. ఈ ఫలితాలు పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా అత్యంత భద్రతను ఈ వాహనాలు అందిస్తున్నాయని తెలియజేస్తున్నాయి. కాగా, ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో డ్రైవర్, ప్రయాణికుడికి తల, మెడ, పై కాళ్ల రక్షణకు గరిష్టంగా 4.000 పాయింట్లు రావడం విశేషం. ఇది Bharat NCAP స్కేల్‌లో అత్యధిక స్కోర్ గా నిలిచింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో పెద్దల కోసం 16కి 16 పాయింట్లు, పిల్లల కోసం 8కి 8 పాయింట్లు సాధించడంతో ఈ SUVలు తమ బలమైన భద్రతా నిర్మాణాన్ని మరోసారి రుజువు చేశాయి.
Read Also: Drishyam 3: ‘దృశ్యం 3’కు గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
ఇక, పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో తలకు గాయాల ముప్పును సూచించే విలువలు కూడా చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇవి Bharat NCAP నిర్దేశించిన ప్రమాద పరిమితికి చాలా దిగువగా ఉండటం గమనార్హం. అంటే తీవ్రమైన ప్రమాద పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు మెరుగైన రక్షణ అందించగల సామర్థ్యం ఈ వాహనాల్లో ఉంటుంది. Bharat NCAP అనేది భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన భద్రతా అంచనా కార్యక్రమం. ఇది Global NCAPకు అనుగుణంగా పని చేస్తుంది. వాహనాలను వివిధ రకాల క్రాష్ టెస్ట్‌లకు గురి చేసి 3 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్‌లను ఇస్తుంది. ఇందులో 5-స్టార్ రేటింగ్ సాధించడం అంటే, భారత మార్కెట్‌లో అమలులో ఉన్న అత్యంత కఠిన భద్రతా ప్రమాణాలను ఆ వాహనం పూర్తిగా పాటించిందని అర్థం. ఈ నేపథ్యంలో VF 6, VF 7కు లభించిన గౌరవంగా విన్ఫాస్ట్ భావిస్తుంది.
ఈ సందర్భంగా విన్ఫాస్ట్ ఇండియా సీఈవో తపన్ ఘోష్ మాట్లాడుతూ.. VF 6, VF 7లకు Bharat NCAP నుంచి లభించిన 5-స్టార్ రేటింగ్‌లు, భారత్‌లో మా ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత, భద్రతా ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో తెలుస్తుంది. వినియోగదారుల భద్రతతో పాటు పూర్తి నమ్మకాన్ని అందించే వాహనాలను తయారు చేయడమే మా లక్ష్యం అన్నారు. కాగా, తమిళనాడులోని విన్ఫాస్ట్ తయారీ కేంద్రంలో అసెంబుల్ అవుతున్న VF 6, VF 7 SUVలు, ప్రీమియం సెగ్మెంట్‌లో భద్రత, ఆధునిక టెక్నాలజీతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయే ఆచరణాత్మకతని అందిస్తుంది. ఈ వాహనాల్లో 7 ఎయిర్‌బ్యాగ్స్, అధునాతన ADAS ఫీచర్లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, VinFast VF 6, VF 7కు Bharat NCAP నుంచి లభించిన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో భద్రతకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఇవి కస్టమర్లకు మరింత భద్రత, నమ్మకం, ఆధునిక సాంకేతికతను అందించే అత్యుత్తమ ఎలక్ట్రిక్ SUVలుగా నిలుస్తున్నాయి.