Tata: పండగ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా. తన ఈవీ కార్లను పెద్ద ఎత్తు విక్రయించేందుకు ప్లాన్ చేసింది. నెక్సాన్ EV, పంచ్ EV మరియు టియాగో EV ధరలను రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా నెంబర్-1గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో దాదాపుగా 74 శాతం మార్కెట్ వాటాతో 74,000 యూనిట్లను విక్రయించింది.
వేరియంట్ ఆధారంగా నెక్సాన్ EVకి రూ. 3 లక్షల వరకు , పంచ్ EVకి రూ. 1.20 లక్షల వరకు టియాగో EVకి రూ. 40,000 వరకు ధరని తగ్గించింది. ప్రస్తుతం దేశంలో నెక్సాన్EV దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.
పరిమిత కాలం వరకు ఈ తగ్గుదల నెక్సాన్ EV, పంచ్ EVల యొక్క బేస్ వేరియంట్లకు వర్తించనుంది. తగ్గిన ధరలతో ప్రస్తుతం ఎంట్రీ లెవల్ నెక్సాన్ EV ధర రూ. 12.29 లక్షలకు, ఎంట్రీ లెవల్ పంచ్ రూ. 9.99 లక్షలుగా ఉంది. అంతకుముందు వీటి ధర నెక్సాన్ EV బేస్ వేరియంట్ రూ. 14.49 లక్షలు, పంచ్ EV బేస్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలగా ఉంది. ఈ ధరల్ని ఎక్స్-షోరూం ధరలు.
ఇదే కాకుండా టాటా తన ఈవీ కస్టమర్ల కోసం టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలల పాటు ఉచిత ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 5,500 టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. టాటా ప్రకారం, పండుగ ధరలు మరియు ఆఫర్లు అక్టోబర్ 31 వరకు చెల్లుతాయి. పరిమిత కాల ధరల తగ్గింపు ఈవీల ధరల్ని తగ్గించడంతో పాటు ఈవీలకు పెట్రోల్/డిజిల్ వాహనాల ధరల మధ్య అంతరాన్ని కూడా తగ్గించింది.