Mahindra XUV 3XO: దేశీయ ఆటో మేకర్ మహీంద్రా కార్లు కొనాలంటే సంవత్సరాలు ఆగాల్సిందే అనే భయం కస్టమర్లలో ఉంది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ‘‘వెయిటింగ్ పీరియడ్’’ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మహీంద్రా XUV 3XO కొనే వారికి గుడ్ న్యూస్, ఈ ఎస్‌యూవీ కోసం వేచి చూసే సమయం తగ్గింది. XUV 3XO 2024లో మార్కెట్‌లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. అత్యధిక పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో దాదాపుగా రెట్టింపు అమ్మకాలను నమోదు చేసింది. ఇది టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, స్కోడా కైలాక్ వంటి మోడళ్లకు పోటీగా ఉంది.
గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఈ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వేచి చూసే కాలం తగ్గింది. వేరియంట్ వారిగా వెయిటింగ్ పీరియడ్‌ని పరిశీలిద్దాం.
మహీంద్రా XUV 3XO: ధర, వేరియంట్లు:
మహీంద్రా XUV 3XO తొమ్మిది ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. MX1, MX2, MX2 PRO, MX3, MX3 PRO, AX5, AX5L, AX7, AX7L వేరియంట్లను కలిగి ఉంది. ఈ వేరియంట్ల ధరలు రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి టాప్-ఎండ్ వేరియంట్‌కు రూ. 15.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇంజన్ ఛాయిస్‌లు చూసుకుంటే, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ TGDi పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 6-స్పీడ్ MT, AT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.
వెయిటింగ్ పీరియడ్:
మహీంద్రా XUV 3XO యొక్క ఎంట్రీ-లెవల్ MX1 వెయిటింగ్ పీరియడ్ 1 ఏడాది కన్నా ఎక్కువగా ఉంది. అన్ని వేరియంట్లతో పోలిస్తే దీనికే ఎక్కువ కాలం ఉంది. ఈ వేరియంట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చే MX2 వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ కేవలం 0-2 వారాల మధ్య ఉంది. MX2 ప్రో పెట్రోల్ ఇంజన్ కోసం 10 వారాల వరకు వేచి చూడాల్సి ఉంది. దీంట్లో డీజిల్ ఇంజన్ వేరియంట్ 0-2 వారాల లోపే కస్టమర్లకు డెలివరీ అవుతుంది.
పెట్రోల్ పవర్‌ట్రెయిన్ MX3 వేరియంట్ 10 వారాల వరకు, డీజిల్ వేరియంట్ 0-2 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. MX3 ప్రో వేరియంట్‌కి కూడా అదే వెయిటింగ్ పీరియడ్ ఉంది. AX5 వేరియంట్‌లో పెట్రోల్ ఇంజన్ కోసం 8 వారాలు, డీజిల్ ఇంజన్ కోసం 0-2 వారాలు వేచి చూడాలి. AX5L వేరియంట్ కోసం 0-2 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక టాప్ ఎండ్ AX7 వేరియంట్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లకు 0 నుండి 2 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. AX7 L కోసం 0-2 వారాలు ఎదురుచూడాల్సిందే.