కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విభాగంలోకి ప్రవేశించింది. ఈవీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా నిర్ణయించింది కియా. మొత్తం రెండు రకాలలో లభించనున్న ఈ మోడల్ రూ.59.95 లక్షలు కాగా, మరొకటి రూ.64.95 లక్షలని పేర్కొంది. విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరింత విస్తరించడానికి రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు, 2025 నాటికి ఇక్కడే తయారైన ఈవీ మోడల్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ వెల్లడించారు.
కియా అనుబంధ సంస్థయైన కియా కార్పొరేషన్ ఈవీ రంగంలో 22.22 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవీ జర్నీలో భాగంగా పలు రకాల మోడళ్ళను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు, వచ్చే ఐదేండ్లలో 14 సరికొత్త మోడళ్ళను పరిచయం చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్‌కు ఇప్పటికే 355 బుకింగ్‌లు రావడం విశేషం. అయితే.. దేశంలోని 12 నగరాల్లో కంపెనీకున్న 15 డీలర్‌షి్‌పల ద్వారా ఈ కారును విక్రయించనున్నట్లు తెలిపారు. డీలర్ కేంద్రాల్లో 150కేడబ్యూ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది కియా.