దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
లుక్-డిజైన్:
ఇది డిజైన్ పరంగా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ దాని ఐసీఈ-ఆధారిత (పెట్రోల్-డీజిల్) మోడల్‌ను పోలి ఉంటుంది. చాలా వరకు బాడీ ప్యానెళ్లలో ఎలాంటి మార్పు లేదు. అందులో కొన్ని ప్లాస్టిక్ భాగాలు మాత్రమే అమర్చారు. ఎలక్ట్రిక్ కార్ల వంటి సాంప్రదాయక కవర్ ఫ్రంట్ గ్రిల్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ దీంట్లో అమర్చారు. ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలోనే ఉంచారు.
పెద్ద స్క్రీన్ సెటప్..
కారు లోపలి భాగంలో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. కోనా ఎలక్ట్రిక్ నుంచి ప్రేరణ పొందిన స్టీరింగ్ వీల్ ఇచ్చారు. ఇది కొత్త ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్‌ను అందిస్తుంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, ADAS సూట్, హ్యుందాయ్ డిజిటల్ కీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.
బ్యాటరీ వివరాలు..
క్రెటా ఎలక్ట్రిక్ లిథియం మెటల్ బేస్డ్ కాంపోజిట్ (LMC) బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఫ్లోర్ బోర్డులో ఇన్స్టాల్ చేశారు. ఈ బ్యాటరీ అమర్చడానికి కంపెనీ ఎస్‌యూవీ యొక్క సస్పెన్షన్‌లో మార్పులు చేసింది. దీంతో క్రెటా ICE వెర్షన్‌తో పోలిస్తే, ఎలక్ట్రిక్ క్రెటా యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ పెరిగింది. కారు ఎత్తు 20 మిమీ పెరిగింది. ఇతర కార్ల తయారీదారులు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఉపయోగిస్తుండగా.. హ్యుందాయ్ ఎల్‌ఎమ్‌సీ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది.
రెండు బ్యాటరీ ప్యాక్‌లు…
క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో వస్తోంది. ఇందులో 42kWh, 51.4kWh బ్యాటరీలు ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు వరుసగా 390 కి.మీ, 473 కి.మీల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సామర్థ్యాన్ని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) క్లెయిమ్ చేసింది. క్రెటా ఎలక్ట్రిక్ (లాంగ్ రేంజ్) 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని హ్యుందాయ్ పేర్కొంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌ను అమర్చారు.
58 నిమిషాల్లో ఛార్జ్:
క్రెటా ఎలక్ట్రిక్ ను కేవలం 58 నిమిషాల్లో (DC ఛార్జింగ్) 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని హ్యుందాయ్ పేర్కొంది. అయితే 11 kW ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్‌తో 4 గంటల్లో 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. క్రెటా ఎలక్ట్రిక్ 4 వేరియంట్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇవే.. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్.