పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది.
చెన్నైలోని ఆవడి వద్ద లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్ వర్క్‌షాప్ నుండి ఆవడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. మెరీనా బీచ్‌కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 23) సాయంత్రంలోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత ఈ తుఫానుకు 'హమున్' అని పేరు పెట్టనున్నారు.
ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
వన్డే వరల్డ్ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ 49 ఓవర్లలో సునాయాసంగా చేధించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది.
టీడీపీ-జనసేన జేఏసీ మీటింగ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విధానం ఏంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్... 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్ లక్ష్యమని మంత్రి అన్నారు.
సిద్దిపేటలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట కల నెరవేరిందని అన్నారు. దసరా పండుగ లోపు సిద్దిపేటకి రైలు తెస్తాను అని గత దసరా రోజున చెప్పానన్నారు. ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖండన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిపై తీర్మానాలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని లోకేశ్ తెలిపారు.