భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది.
మెదక్ జిల్లా రామాయంపేట తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఉదయం ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే రామాయంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారంలో బల్లి పడడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటన పై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయింది. నలుగురిపై చర్యలు తీసుకున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో.. రేపట్నుంచి తెలంగాణలో రైతు భరోసా సదస్సులు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రేపటి నుంచి 22 వరకు వర్క్ షాప్ జరుగనుంది. ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. పాలమూరు- రంగారెడ్డి తప్పా.. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో కల్తీ వైన్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళా వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు.
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే తమకు ఉద్యోగాలు వస్తాయని.. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు.
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు.
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కమ్యూనిటీ కళ్యాణ మండపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కసితో ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.