గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సబ్సిడీ నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్లను విడుదలకు పాలనానుమతి ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31 తేదీన ఒక ఉచిత సిలిండర్‌ను ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది.
వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు సహృదయ నేస్తాలు స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో సోమవారం కలిసి పలువురు చెక్కులు అందించారు.
విశాఖకు వెళ్లిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాగా.. అప్పటికే విమానం విశాఖకు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో విమానం విశాఖలో ల్యాండింగ్ అయిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత సమాచారం లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డి వేసిన పిల్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. బాలినేని పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
అక్టోబర్ 25న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను భారత మహిళ గెలుచుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ గుప్తా నిలిచారు. పంజాబ్ జలంధర్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్.. 70కి పైగా దేశాలకు చెందిన పోటీదారులను ఓడించింది.
నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
పూజల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధాంతి అముదాలపల్లి వెంకటాచార్యులు ఘరానా మోసం చేశారు. పెనుమంట్ర మల్లెపూడి గ్రామానికి చెందిన పెచ్చేటి గోపాలకృష్ణకు క్షుద్ర పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని అతని కుటుంబ సభ్యులను బోల్తా కొట్టించాడు. రూ. 37లక్షల 50 వేలు టోకరా వేశాడు సిద్ధాంతి.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు.
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్‌లో బసచేసింది.