బాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. ముంబైలో జరుగుతున్న ప్రముఖ అమెరికన్ డీజే డేవిడ్ గెట్టా ‘సన్‌బర్న్’ సంగీత కచేరీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ వేగంగా వచ్చి నోరా కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమె సిబ్బంది అప్రమత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read : BMW : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టికెట్ రేట్లు విషయంలో..మాస్ రాజా షాకింగ్ నిర్ణయం
ఈ ప్రమాదం కారణంగా నోరా తలకు బలమైన దెబ్బ తగలడంతో ఆమె ‘కంకషన్’ (ఒక్కసారిగా తల తిరిగి మతి భ్రమించి నట్లు కావడం)కు గురయ్యారు. అంతర్గత రక్తస్రావం ఏమైనా ఉందేమోనని వైద్యులు వెంటనే సీటీ స్కాన్ నిర్వహించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం లేదని, స్వల్ప కంకషన్ మాత్రమేనని వైద్యులు నిర్ధారించారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ, తన వృత్తి పట్ల ఉన్న అంకితభావంతో నోరా అదే రాత్రి సన్‌బర్న్ 2025 వేదికపై ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ తన తదుపరి అంతర్జాతీయ సింగిల్ టీజర్‌ను కూడా ఆమె ఆవిష్కరించారు. అయితే తాజాగా ఈ విషయంపై నోరా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది.
ప్రస్తుతం నోరా చేతిలో ‘కాంచన 4’, ‘KD: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్టులతో పాటు ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ది రాయల్స్’ అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ వెంటనే స్టేజ్ ఎక్కడం ఆమె ధైర్యానికి నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.