ఉస్మానియాలో మేము, ఇక్కడ మీరు ఉద్యమాలు చేస్తే మనకు తెలంగాణ వచ్చిందని ప్రజలనుద్దేశించి ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పేర్కొన్నారు. తన పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని ఆయన చెప్పారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది అంటూ ఆయన తెలిపారు.
మెదక్‌లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డిలపై మైనంపల్లి హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఖబడ్ధార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. వేలాది మంది జనాలను, పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు.
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన చాలామంది బీజేపీలో చేరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంకో రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారాన్ని వచ్చే నెల 3 నుంచి నిర్వహిస్తామన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు నిజమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రసంగించారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ఏ టీం, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్‌లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు.
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు.
కేసీఆర్‌ను విమర్శించే నాయకులకు కూడా సర్కార్ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినా కేసీఆర్ ఏమి చేసిండు అని విపక్ష నేతలు అంటారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌వీ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.