Bandi Sanjay: పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పేర్కొన్నారు. తన పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని ఆయన చెప్పారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది అంటూ ఆయన తెలిపారు. పార్టీకి దూరమైనా ధర్మం కోసం పోరాడిన వీరుడు రాజాసింగ్ అంటూ బండి సంజయ్ కొనియాడారు. ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా హిందూ ధర్మం కోసం పోరాడే కార్యకర్తలు బీజేపీకే సొంతమని చెప్పారు. తెలంగాణ ప్రజలేనాడు ‘రాజీ’కీయాలను హర్షించరని తెలిపారు.
Also Read: Madhuyashki Goud: తెలంగాణకు ముందు జనం మనం అన్నారు.. గెలిచాక ధనం మనం అంటున్నారు
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ జైలుకు పోయిన చరిత్ర నాది అంటూ చెప్పుకొచ్చారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే మేయర్ పదవి ఎంఐఎంకు ఇచ్చేలా చీకటి ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంకు 30 స్థానాలు కేటాయించి గెలిపించే బాధ్యత బీఆర్ఎస్‌కు అప్పగించారన్నారు. ఓడిపోతామనే భయంతోనే పచ్చ జెండా పట్టుకుని దారుస్సలాం పోయి ఒవైసీకి బీఆర్ఎస్ నేతలు సలాం చేశారని ఆయన ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులను ప్రలోభ పెట్టేందుకు డబ్బు వెదజల్లుతున్నారని ఆరోపణలు చేశారు. దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండంటూ ఆయన సూచించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.