తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయనను మూడు నెలలు హోటల్‌లో పెట్టానని.. అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని ఆయన చెప్పారు.
రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు.
నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ 'రా కదలి రా' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.
మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది.