ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది.
రేపు(మంగళవారం) వైన్ షాపులు, బార్లు తెరుచుకోవు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గ్రామ శివారు నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి అహుతి అవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయమే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు.
ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.