MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. అనంతరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైలులో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. కవిత పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.
Read Also: Kaleshwaram: కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కలకలం
ఇదే వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు ఉండటంతో సీబీఐ కేసులోనూ అదే తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్టు జస్టిస్ కావేరీ బవేజా పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతోనే ముగియనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరిస్తే.. 23న ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరిస్తే కవిత పై కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.