గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తీసుకుంటుందని డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. జూలై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది.
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు.
గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి.
నెల్లూరులోని బర్మాషెల్ గుంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని పదిహేనేళ్ల దివ్యాంగురాలు నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.
వివిధ విభాగాల్లో కొనసాగుతోన్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డైన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం వచ్చిన ఆదేశాలను సర్కారు రద్దు చేసింది. రిటైరైనా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.