CM Chandrababu: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు.
అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం
అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇవి ప్రజల సంపద.. వారికే సొంతమన్నారు. పోలవరం పూర్తైతే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేశారని.. పోలవరం విషయంలో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం.. శాపంగా మారిందన్నారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. అందరి ఆశీస్సులు.. స్థల మహత్యం వల్లే అమరావతిని కాపాడేలా చేశాయన్నారు. ఇక్కడున్న అల్లరి మూకలు అమరావతి నమూనాను కూడా విధ్వంసం చేశారని.. గత ఐదేళ్ల కాలంలో అమరావతిలో విధ్వంసం సృష్టించారు.పైపులు దొంగిలించారు.. రోడ్లను విధ్వంసం సృష్టించారని.. టీడీపీ హయాంలో ఉండగా పని ఎక్కడ ఆగిందో.. అక్కడే నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ సముదాయం 80 శాతం పూర్తైందన్నారు. సెక్రటరీల బంగ్లాల్లో తుమ్మ చెట్లు మొలిచాయన్నారు. అమరావతిలో ఐకానిక్ కట్టడాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు.
కర్నూలును మోడల్ సిటీగా మారుస్తాం..
అమరావతి ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామన్నారు. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధాని ఎక్కడుంటాలంటే రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎనిమిదో తరగతి పిల్లాడు కూడా చెబుతాడు. మూడు రాజధానులని వైసీపీ మూడు ముక్కలాడిందని.. పదేళ్ల తర్వాత ఏపీ రాజధాని ఏదంటే.. చెప్పలేని పరిస్థితి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇక్కడి రైతులు స్వచ్ఛంధంగా భూములిస్తే అపవాదులు వేశారని.. ఇబ్బందులు పెట్టారని.. అమరావతికి ఎంత నష్టం జరిగిందనే విషయమై అంచనా వేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని మొత్తంగా నిర్మాణాలకు అడ్డంగా ఉన్న తుమ్మ చెట్లను తీసేయిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగు తెచ్చే బాధ్యత వ్రధాని మోడీ, తన పైన ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వాములను చేస్తామని సీఎం తెలిపారు. కంకర కూడా దొంగిలించిన వారిని వదిలేయడం సరైంది కాదన్నారు. తప్పు చేసిన వారిని నిర్మోహటంగా అణచివేస్తామన్నారు.