Gannavaram Airport: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తీసుకుంటుందని డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. జూలై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్ఎఫ్ అధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉప సంహరించాలని లేఖలో వెల్లడించింది. జూలై 2 నుంచి భద్రతా విధులు చేపట్టనున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం బారక్‌లు కూడా ఖాళీ చేయాలని డీజీపీని ఎయిర్ పోర్ట్ అథారిటీ కోరింది.
Read Also: International Yoga Day 2024: బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ అయిదు ఆసనాలు ట్రై చేయండి
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భద్రతను పెంచాలని నిర్ణయించి సీఐఎస్‌ఎఫ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఒమన్, కువైట్, కొన్ని ఇతర మధ్యప్రాచ్య దేశాలకు విమానాలు ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2017 మేలో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో 400 మంది పోలీసులు వివిధ విభాగాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీఐపీ సందర్శనల సందర్భంగా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లగేజీ చెకింగ్ ప్రాంతం భద్రతను పర్యవేక్షిస్తుంది, అయితే ఏపీఎస్పీ బయటి ప్రాంతాన్ని చూసుకుంటుంది. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. వీటితోపాటు బాంబ్ డిటెక్షన్ (బీడీ), హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, రోడ్ ఓపెన్ పార్టీలు, డాగ్ స్క్వాడ్‌లను వీఐపీ సందర్శనల సమయంలో మోహరిస్తారు. డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 24 గంటలూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు ఇక్కడకు వస్తున్నందున గన్నవరం విమానాశ్రయంలో భద్రతను పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.