Kadapa Crime: మద్యపానం కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది.. మద్యం కోసం డబ్బులు లేక.. కుటుంబ సభ్యులను.. తెలిసినవారిని వేధిస్తున్నారు.. ఇంకా కొందరైతే.. మద్యం మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు.. తాజాగా కడపలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులు ఇవ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని అయితే 300 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా ఇవ్వాలంటూ ఆమెను హింసించాడని, డబ్బులు ఇవ్వడానికి జమీల నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తన కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడని, అయితే, అక్కడి నుంచి తప్పించుకున్న పిల్లలు బంధువులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పారిపోయి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లు వారు వివరించారు. కొన ఊపిరితో ఉన్న జమీలను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం కూడా ఆమె మృతి కి ఒక కారణమని వారు ఆరోపిస్తున్నారు.
Read Also: Road Accident: బోల్తాపడ్డ గ్రానైట్ ఆటో ట్రాలీ.. ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు!