Gandikota: కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం నాడు సాయంత్రం, ఓ యువకుడితో కలిసి పల్సర్ బైక్ పై గండికోటకు వచ్చిన యువతి, కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోందని పోలీసులు వెల్లడించారు.
Read Also: Bollywood : రాముడి కథకి రూ. 4 వేల కోట్లు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆమె వేసుకున్న దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో, వైష్ణవితో వచ్చిన యువకుడు కొద్దిసేపటి తర్వాత ఒక్కడే తిరిగి వెళ్లినట్టు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పలుచోట్ల సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రేమ వ్యవహారం లాంటిది ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అలాగే, నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు.