కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని.. కానీ అలా లేదని తెలిపారు. పైకి అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ అంత ఉపయోగకరంగా అనిపించడంలేదని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు.
ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని… 2021లో ఏపీ ఆర్థిక లోటు 5.38 శాతం అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 2022లో ఏపీ ఆర్థిక లోటు 3.49 శాతం అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటరాదంటోందని విమర్శించారు. ఎఫ్ఆర్‌బీఎంపై కేంద్ర ప్రభుత్వానివి ద్వంద్వ ప్రమాణాలు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
మూలధన వ్యయంలో రాష్ట్రాలకు కేటాయింపును రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచడం స్వాగతించదగిందే అయినా అది రాష్ట్రాలకు పంచేటప్పుడు కేంద్ర అవలంభిస్తున్న విధానం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ విధానం వల్ల రూ.లక్ష కోట్లలో ఏపీకి వచ్చేది కేవలం 4.047 శాతమే అన్నారు. రొయ్యల ఉత్పత్తిపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నామని, నదుల అనుసంధాన ప్రణాళికను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర 2022-23 బడ్జెట్ కరోనాకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ లాగా ఆశాజనకంగా ఉంటుందని భావించాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ మేరకు లేదు. పైకి చూడటానికి అంకెలు బాగా ఉన్నా అంత ఉపయోగకరంగా అనిపించడం లేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 1, 2022