పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయితీ గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ నిర్మల దిశా యాప్ డౌన్లోడ్ చేసేందుకు గ్రామస్తులు వద్దకు వెళ్ళారు. గ్రామంలో ఉన్నవారి మొబైల్ కి దిశ యాప్ డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒడిశా సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఒడిశా సెల్ సిగ్నల్స్ తో యాప్ డౌన్లోడ్ అవ్వకపోతుండడంతో ఆమె తెలివిగా ఆలోచించింది. గ్రామానికి చాలా దూరంగా ఆంధ్రప్రదేశ్ సెల్ సిగ్నల్ ఎక్కడ వస్తుందో పరిశీలించి సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీదకు ఆయా గ్రామాల ప్రజలను తీసుకువచ్చింది.
దిశ యాప్ వారి మొబైల్లో డౌన్లోడ్ చేయించింది. దిశ యాప్ ని ఈ ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది, దీని వలన మహిళలకు ఎంత రక్షణ, మేలు కలుగుతుందో వివరించింది. వివిధ గ్రామాల్లో అమాయకమైన, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మహిళలకు అవగాహన కల్పిస్తూ ఆయా గ్రామాల్లో నివాసముంటున్న గిరిజన మహిళల్లో చైతన్యాన్ని నింపుతోంది. ఈ పనులన్నీ కష్టమైనా ఇష్టంతో ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ పోలీసు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకూ సుమారుగా ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలతో మమేకమై వందకు పైగా మొబైల్స్‌లో దిశ యాప్ డౌన్లోడ్ చేయించానని తెలిపింది.
మా సచివాలయం పరిధిలోగల అనేక గ్రామాల మహిళలకు ఈ యాప్ ఉపయోగాలను తెలియజేసి యాప్ వారి మొబైల్లో వుండడం వల్ల ఆపద సమయంలో కలిగే ప్రయోజనాలను వివరించడం జరుగుతుందని తెలిపింది. అనేకమంది మహిళలు యాప్ రిజిస్ట్రేషన్ పై ఆసక్తిచూపుతున్నారని అయితే ఈ ప్రాంతంలో సిగ్నల్ సమస్య వుందన్నారు. ఈ కారణంగా దిశ చట్టం వలన కలిగే ప్రయోజనాలను గిరిజన ప్రజలు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో తాను విధులు నిర్వహిస్తున్నానన్నారు. గిరిజన మహిళలు మాట్లాడుతూ మాకు దిశ యాప్ గురించి తెలియదని మహిళా పోలీస్ నిర్మల గ్రామాలకు వచ్చి దిశ చట్టం కోసం పూర్తి అవగాహన కలిగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మహిళల కోసం మంచి చట్టం తెచ్చిన సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Asani Cyclone: అలర్ట్.. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు