ఉద్యోగ సంఘాలకు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ లేఖ రాసింది.
నిన్నటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
తెలంగాణాలో నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో గత నెలాఖరు వరకు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ విద్యా సంస్థలను పునః ప్రారంభిస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణాలో కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం మార్గదర్శకాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రివిజన్ అఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది.
జనవరి నెల వేతనాలు కొత్త పే స్కేల్ ప్రకారం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. కొత్త వేతన స్కేల్ ప్రకారం అమలు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేసింది.
నేడు టీఎస్ ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. సమ్మె చేపట్టడంపై టీఎస్ ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకోనుంది.
కడప జిల్లాలోని రాజంపేటలో సకల జనుల ర్యాలీ నిర్వహించనున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ తో ర్యాలీ చేపట్టనున్నారు.