Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే మిట్టల్ స్టీల్ వంటి పరిశ్రమలు ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో ఉంది.
Read Also: America: తెల్లవారుజామున కారుకు ఎదురు వచ్చిన వింత జీవి.. ఉలిక్క పడ్డ డ్రైవర్
హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ కుంపటిని రాజేసింది. టీడీపీకి గట్టిపట్టున్న మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో జనం ఎదురుతిరగడం, అనితను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మత్స్యకారుల ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి. బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ఐదేళ్ళ కార్మిక పోరాటం ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ ఉక్కుకు వచ్చిన ముప్పేమీ లేదని కూటమి స్పష్టం చేస్తోంది. అయినా, విశాఖ ఉక్కు- తెలుగోడి హక్కు నినాదం నిత్యం రగులుతూనే వుంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలనే డిమాండ్ ఎమ్మెల్యేలకు నిత్యం ఒత్తిడికి గురిచేస్తోంది. అలా ఎదుర్కొంటున్న వారిలో పల్లా శ్రీనివాస్ ముందు ఉన్నారు.
అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం పెదగంట్యాడలో తలపెట్టిన గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ చుట్టూ వ్యతిరేకత ముసురుకుంటోంది. 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనికి వేయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఈ నెల 8న పబ్లిక్ హియరింగ్ జరగనుండగా జనావాసాల మధ్య సిమెంట్ పరిశ్రమ ఏర్పా టు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. పారిశ్రామిక అభివృద్ధి ఎవరు కాదనలేనిది. కానీ, రెడ్ జోన్ ఇండస్ట్రీస్ కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే జనంలో ఇంత వ్యతిరేకత వస్తుందంటున్నారు.